హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : అభివృద్ధి కార్యక్రమాలపై విధిస్తున్న 18శాతం జీఎస్టీని ఎత్తివేయాలని పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్టీకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తున్నదని వారు తెలిపారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం నిర్వహించిన సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య అధికారులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రజల కోసం చేసే పనులపై పెద్ద ఎత్తున జీఎస్టీ విధించడం సరికాదన్నారు.
రాష్ట్రంలో పట్టణ జనాభా 50శాతానికి చేరుతున్నదని, నిధుల కొరత పట్టణాలను పీడిస్తున్నదన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ హైదరాబాద్లో మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ నిధులను ఇతర వాటికి మళ్లించకుండా, ప్రతి వ్యక్తికి ఇచ్చే మొత్తాన్ని పెంచాలని గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులు 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను గ్రామాలే ఖర్చు చేసుకునేలా చేయాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ నిధుల ఆవశ్యకత, ఆదాయ మార్గాలను పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేశ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.