హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో కేసుల విచారణను పూర్తి గా హైబ్రిడ్ విధానంలో నిర్వహించేందుకు అడుగులు వేస్తున్నామని సీజే జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. ఇప్పటికే మొదటి కోర్టులో కేసుల విచారణ హైబ్రిడ్ పద్ధతిలో సాగుతున్నదని, త్వరలో ఈ విధానాన్ని మిగిలిన కోర్టుల్లోనూ ప్రారంభిస్తామని వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం హైకోర్టు ఆవరణలో సీజే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ అలోక్ అరాధే ప్రసంగిస్తూ.. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని, ఇప్పటికే దాదాపు 8 కోట్ల పేజీల డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. కార్యక్రమం లో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు, పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.