
కాళేశ్వరం/తొగుట/చిన్నకోడూరు, డిసెంబర్ 2: రెండున్నరేండ్లలో 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్న సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడం గొప్ప విషయమని నాబార్డు చైర్మన్ జీఆర్ చింతల కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ బరాజ్, లక్ష్మీ పంప్‌హౌస్, సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్, చిన్నకోడూరు మం డలంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను గురువారం ఆయన సందర్శించారు. మోటర్ల పనితీరుపై ఆరా తీశారు. నీటి సామర్థ్యంతోపాటు గేట్ల ను పరిశీలించారు. చేపట్టిన పనులు, వాటి సామ ర్థ్యం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చింతల మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ స్థాయిలో ఇంత త్వరగా ఎక్కడా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేసిందని తెలిపారు.
మల్లన్నసాగర్ నిర్మాణానికి నాబార్డు ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి ఈఎన్సీ (జనరల్) మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ నాబార్డు చైర్మన్‌కు ప్రాజెక్టు ప్రత్యేకతలను వివరించారు. ప్రాజెక్టు పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులోకి నీళ్లు రావడంతో సంతోషంగా ఉన్నదన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన చాలా గొప్పగా ఉన్నదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ప్రాజెక్టులు నిర్మించి రైతుల అభివృద్ధికి దోహద పడుతుందని తెలిపారు. ఎక్కడా చూసిన రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉన్నదన్నారు. అనంతరం బస్వాపూర్ ప్రాజెక్టును హెలీకాప్టర్ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట నాబార్డు ఉమ్మడి రాష్ట్ర చీఫ్ జనరల్ వీకే రావు, ఎస్ఈ వేణు, ఈఈ వెంకటేశ్వర్రావు తదితరులు ఉన్నారు.