
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం నుంచి అనేక ఎన్నికలు జరిగాయి. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎన్నిక ఏదైనా కావొచ్చు. నాటినుంచి గులాబీ జెండాకు, కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు అందిస్తున్న విజయాల పరంపరలో తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చి చేరాయి. ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు అఖండ మెజార్టీని కట్టబెడుతూ వస్తున్నారు. టీఆర్ఎస్ అంటే.. తెలంగాణలో ప్రతి ఇంటికీ సొంత పార్టీయే అన్నంతగా ఆదరణ లభిస్తున్నది. ఏ రాజకీయ పార్టీతో అంటకాగకుండా ఒంటరిగా పోటీచేసి అద్భుతమైన విజయాలను టీఆర్ఎస్ సొంతం చేసుకొంటున్నది. బ్యాలెట్ అయినా, ఈవీఎంలు అయినా.. పార్టీ మద్దతుతో పోటీచేసినా పార్టీ రహితంగా పోటీ చేసినా గెలుపు గులాబీ దళానిదే. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలు గెలుచుకొన్న టీఆర్ఎస్ బలం 2018 ఎన్నికల్లో 88 స్థానాలతో పైపైకి పోయింది. ఆ తర్వాత మెదక్, వరంగల్ లోక్‌సభ స్థానాలకు.. పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించింది. తదుపరి జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘన విజయాలతో రికార్డు నెలకొల్పింది.
2018లో 46.87శాతం ఓట్లు
శాసనసభకు 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 46.87% ఓట్లతో 88 స్థానాలు దక్కించుకొన్నది. కాంగ్రెస్ 28.43% ఓట్లకు పరిమితమైంది. బీజేపీకైతే 6.98% ఓట్లు రావడమే గగనమైంది. ఎంఐఎం 2.71% ఓట్లతో 7 సీట్లు గెలుచుకొన్నది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచినా తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. టీఆర్ఎస్ 41.71% ఓట్లు సాధించింది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కేటాయించిన ఏడు స్థానాలూ టీఆర్ఎస్కే చెందాయి. ఉమ్మడి ఏపీలో గత మూడు దశాబ్దాల్లో అన్ని స్థానాలనూ ఏకపక్షంగా గెలిచిన పార్టీ ఏదీలేదు.
స్థానిక సంస్థలన్నీ టీఆర్ఎస్వే..
2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మొత్తం 32 జడ్పీ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ తన వశం చేసుకున్నది. జడ్పీటీసీల్లో టీఆర్ఎస్ 83.42% ఓట్లను దక్కించుకొన్నది. కాంగ్రెస్ 13.96%, బీజేపీ 0.14% ఓట్లు తెచ్చుకోగలిగాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 61.13% ఓట్లను సాధించగా కాంగ్రెస్ 72, బీజేపీ 6 సీట్లను గెలుచుకొన్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు విజయం సాధించింది. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 42.5% ఓట్లను సాధించింది. 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 122 చైర్మన్, మేయర్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొన్నది. బీజేపీ 14.4%, కాంగ్రెస్ 21.7% ఓట్లను సాధించాయి. తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ భారీ సంఖ్యలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 13 మేయర్ స్థానాలను టీఆర్ఎస్సే గెలుచుకొన్నది.
టీఆర్ఎస్కు తిరుగులేదు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు అభినందనలు. టీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు. ఈ విజయంతో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు పట్టం కడుతున్నారు. టీఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయి. పల్లెప్రగతి, పట్టణప్రగతి ద్వారా ప్రతినెలా ఠంచన్‌గా నిధులను అందిస్తూ ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చారు.
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు
తిరుగులేని శక్తి టీఆర్ఎస్
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కే పట్టంకట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, అభ్యర్థులను నిలబెట్టి అయోమయానికి గురిచేయాలని చూసినా టీఆర్ఎస్ సర్కారుతోనే ప్రజలకు మేలు జరుగుతుందని గ్రహించి, భారీ మెజార్టీతో గెలిపించారు. టీఆర్ఎస్ మరోసారి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు.
-మంత్రి హరీశ్‌రావు
బీజేపీ, కాంగ్రెస్‌ను ఛీకొట్టారు
కరీంనగర్లో బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర పొత్తును స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఛీ కొట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు 986 మంది ఉండగా, టీఆర్ఎస్ అభ్యర్థికి 1,063 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తు నచ్చక ఆయా పార్టీలకు చెందిన 86 మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్కు ఓటేశారు.
-మంత్రి గంగుల కమలాకర్

కాంగ్రెస్ ప్రలోభాలను తిప్పి కొట్టిన ఓటర్లు
ఈ విజయంతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు ఎదురులేదని మరోసారి రుజువైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఎవరెన్ని రాజకీయ కుట్రలు చేసినా, ఫలితం టీఆర్ఎస్నే వరించింది. ఇదే స్ఫూర్తితో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గులాబీజెండాను ఎగురవేస్తాం. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపించాయి. తాతా మధు గెలుపునకు సహకరించిన సీపీఐకి కృతజ్ఞతలు.
-మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సీఎం కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ
ఎంసీ కోటిరెడ్డి సాధించిన విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తున్నదని మరోసారి నిరూపితమైంది. గతంలో హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించింది. స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా టీఆర్ఎస్కు ఓట్లేశారు. ఓట్లేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
-మంత్రి జీ జగదీశ్‌రెడ్డి

జాతీయ పార్టీలకు చెంపపెట్టు
జాతీయ పార్టీలకు ఈ ఫలితాలు చెంపపెట్టు. తామే గెలుస్తామని బీరాలు పలికిన నేతలు ఇప్పుడేమంటారు? ఫలితాలను గమనిస్తే ప్రతిపక్ష పార్టీల ఓటర్లు సైతం టీఆర్ఎస్కు ఓటు వేసినట్టు అర్థమవుతున్నది. పచ్చని తెలంగాణను నాశనం చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని గ్రహించి, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు.
-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సీఎం కేసీఆర్ పథకాలతోనే విజయాలు
అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ వల్లే టీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతున్నది. టీఆర్ఎస్ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదు. శాసనమండలిలో ఇతర పార్టీలకు అవకాశం లేదు. తమకు ఓట్లు రాకపోతే రాజీనామాలు చేస్తామని ప్రకటించిన నాయకులు ఎక్కడకుపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వాగే వారికి ఈ విజయం చెంపపెట్టు. బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలి. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు.
-మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్