హైదరాబాద్ : సమాజ సేవతోనే మానవ జీవితానికి సార్ధకత లభిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం అమీర్ పేట డివిజన్లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన కేంద్రం, చలివేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2011 సంవత్సరంలో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 2 నెలల పాటు మధ్యాహ్నం భోజనం అందించడం ఎంతో సంతోషదాయకం అని నిర్వాహకులను అభినందించారు. ఎంతో మంది ఆకలిని తీర్చే ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్న సీనియర్ సిటిజన్స్ సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి తన వంతు సాయంగా మంత్రి రెండు లక్షల రూపాయలను చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్ధసారధికి అందజేశారు. అదేవిధంగా గత 11 సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తున్న డాక్టర్ శ్యామసుందర్ రాజ్యం దంపతులకు మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ట్రస్టీ సభ్యులు కృష్ణారెడ్డి, విఠల్ రెడ్డి, రామమూర్తి, బీకేఎం సత్యనారాయణ, సహదేవ్ గౌడ్, సాయి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.