హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేస్తున్నారా..? అయితే టెస్ట్ జోన్ ఎంచుకొనేటప్పుడే జాగ్రత్తపడండి. ఒకసారి ఎంపికచేసుకున్న తర్వాత టెస్ట్ జోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో మార్చడం కుదరదు. ఎప్‌సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 వరకు, ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నది. ఎప్‌సెట్ పరీక్షల కోసం తెలంగాణ, ఏపీలో ఈ సారి 21 టెస్ట్జోన్లను ఏర్పాటు చేశారు. వీటిల్లో మూడు జోన్లను విద్యార్థులు ఎంపికచేసుకోవచ్చు. విద్యార్థులు ఎంచుకున్న ప్రకారం ఆయా జోన్లల్లోనే పరీక్షాకేంద్రాలను కేటాయించనున్నట్టు ఎప్‌సెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణతో పాటు, ఏపీకి చెందిన వారు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉన్నదని, వీరు ఓపెన్ కోటా (15శాతం) సీట్లకు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.