CM KCR | జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాలు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 24 నుంచి 30వ తేదీ వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడాల పరిధిలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో వున్న4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు అందచేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తద్వారా1,50,224 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని సీఎం స్పష్టం చేశారు.
పోడు భూముల పట్టాలు అందించిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే ఐఎఫ్ఎస్ కోడ్‌తో కూడిన బ్యాంకు ఖాతాను తెరిపించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ, జిల్లాల కలెక్టర్లదే ఈ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ ఖాతాల ద్వారా లబ్ధిదారులకు రైతుబంధును ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. వీరితో పాటు 3.08 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును వర్తింపచేస్తామని సిఎం అన్నారు.
బీసీ కుల వృత్తులను కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుల వృత్తుల మీద జీవనం కొనసాగిస్తున్న విశ్వకర్మలు తదితర బీసీ ఎంబీసీ కులాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షరూపాయల ఉచిత ఆర్థిక సాయాన్ని అందిస్తుందన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటీ సమావేశమై ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలన్నారు. జూన్ 9న జరుపుకునే తెలంగాణ సంక్షేమ సంబురాల్లో సబ్ కమిటీ సిఫారసు చేసిన ఇప్పటికీ ఆదుకోని బీసీ ఎంబీసీ కులాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎం సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ, సీఎంవో కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, పోలీసు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.