ఆఫీస్ ఉండదు.. బాస్ అసలే ఉండడు.. నచ్చితే పని చేయొచ్చు, నచ్చకపోతే పక్కన పెట్టేయొచ్చు. నచ్చిన పనిని, నచ్చిన రేటుకు, నచ్చిన కంపెనీకి చేయవచ్చు.. ఇదీ ఫ్రీలాన్సింగ్ వర్క్ కల్చర్. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతి.. కరోనాతో మన దగ్గరా ఊపందుకొన్నది. ఫ్రీలాన్స్ ఉద్యోగాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. లాక్డౌన్కు ముందు కొన్ని విభాగాలకే పరిమితమైన ఈ విధానం ఇప్పుడు చాలారంగాలకు విస్తరించింది.
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): ఫ్రీలాన్స్.. నిన్నమొన్నటి వరకు కొంతమందే ఆసక్తి చూపేవారు. కరోనా వల్ల దీనికి విపరీతమైన క్రేజ్ పెరుగుతున్నది. యువత, మహిళలు, మధ్యవయస్కులు ఈ విధానానికి మొగ్గుచూపుతున్నారు. ఇంటి నుంచే వర్క్ చేసే అవకాశం ఉండటం, నైపుణ్యాలను సొంతంగా మెరుగుపర్చుకొనే అవకాశం ఉండటం, పెట్టుబడి పెట్టే అవసరం లేకపోవటం, నిర్ణీత పనిగంటల నిబంధన లేకపోవటం వంటి కారణాలతో చాలామంది ఫ్రీలాన్స్ ఉద్యోగాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ అదనపు ఆదాయం కోసం ఈ విధానాన్ని ఎంచుకొనే అవకాశం ఉండటం కలిసివస్తున్నది. అంతకుముందు దేశంలో సుమారు 15 లక్షల మంది ఫ్రీలాన్సర్లు ఉండగా, లాక్డౌన్ నుంచి ఏకంగా 46 శాతం వృద్ధి సాధించిందని పయోనీర్ సంస్థ ఇటీవల ఓ నివేదికలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశమున్నదని పేర్కొన్నది.
ఫ్రీలాన్సర్ల కోసం కొన్ని కంపెనీలు ప్రకటనలు ఇస్తున్నాయి. ఆ ప్రకటనల గురించి తెలియనివాళ్లు ఆన్లైన్ సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో ప్రాచుర్యం పొందిన సైట్లలో అప్వర్క్, 99డిజైన్స్, ట్రూలాన్సర్, ఫ్రీలాన్స్ ఇండియా, టాప్టాల్ వంటివి ఉన్నాయి. ఆయా సైట్లలో మన విద్యార్హతలు, ఏ రంగంలో సేవలను అందించాలనుకొంటున్నాం, పని వేళలు తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. నచ్చిన కంపెనీలు వివరాలు కనుక్కొని పనిని అప్పగిస్తాయి. కొన్ని సైట్లు పనిని కూడా వేలం వేస్తున్నాయి. ఎన్ని రోజుల్లో, ఎంత మొత్తానికి సదరు పనిని పూర్తి చేస్తారన్న వివరాలతో బిడ్లను స్వీకరిస్తుంది. ఉదాహరణకు ఒకరు యాప్ను తయారు చేయించుకోవాలనుకొంటే బడ్జెట్, ఉండాల్సిన ఫీచర్లు, నిర్ణీత గడువును తెలుపుతూ సైట్లో ప్రకటిస్తారు. ఆ సైట్లో రిజిస్టర్ అయిన ఫ్రీలాన్స్ వర్కర్లు బిడ్లను దాఖలు చేస్తే, వాటిని పరిశీలించి తనకు నచ్చిన వ్యక్తికి యాప్ తయారీని అప్పగించుకోవచ్చు. దానికి ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారానే పొందవచ్చు. కొన్ని ఫ్రీలాన్సింగ్ సైట్లు తమ సైట్లో రిజిస్టర్ అయిన ఫ్రీలాన్స్ వర్కర్లకు వచ్చే డబ్బుల్లో కమీషన్ తీసుకొంటే, కొన్ని ఎలాంటి కమీషన్ తీసుకోకుండానే సేవలను అందిస్తున్నాయి.
ఇప్పటివరకు ఎక్కువగా డీటీపీ, డాటా ఎంట్రీ, టెలికాలర్ తదితర విభాగాలే ఎక్కువగా ఫ్రీలాన్స్ ఉండేవి. ప్రస్తుతం ఇందులో ఫొటోషాప్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్, టీచింగ్, ట్యూటరింగ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, 3డీ మోడలింగ్, గేమ్ డెవలప్మెంట్, ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్, ఫొటోగ్రఫీ, ఆర్టికల్ అండ్ బ్లాగ్రైటింగ్ ఇలా 100కు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్ నేపథ్యంలో పలు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ప్రాజెక్టులను ఫ్రీలాన్స్ వర్కర్లతోనే చేయించుకొంటున్నాయి. విదేశాల నుంచీ ఆఫర్లు వస్తున్నాయి.
తీరిక సమయాల్లో ఫ్రీలాన్స్ వర్క్ చేస్తున్నా. డాటా ఎంట్రీ, హెచ్టీఎంఎల్ వర్క్స్ ఉన్నాయి. నెలకు రూ.5వేల వరకు వస్తున్నాయి. పూర్తి సమయాన్ని కేటాయించటం, మన నైపుణ్యంతో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు. వృత్తి నైపుణ్యాలు ఉన్నవారికి ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉన్నది.
–ఉయ్యాల చంద్రమౌళి, వరంగల్
బీటెక్ పూర్తి చేశా. ఎనిమిదేండ్లుగా ఫ్రీలాన్స్ చేస్తున్నా. పైథాన్, మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలపింగ్ తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్నా. ఆ విభాగాలకే ఎక్కువగా డిమాండ్ ఉన్నది. విదేశీ సంస్థలకూ పనిచేస్తున్నా. గంటకు రూ.2 వేలకు పైనే చెల్లిస్తున్నాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఫ్రీలాన్స్లో విపరీతమైన డిమాండ్ ఉన్నది. దీనిపై దృష్టి పెట్టవచ్చు.
–లెక్కల సుధాకర్, హైదరాబాద్