హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వర్సిటీ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల్లో ఈ నెల 20 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన (కరీంనగర్), మహాత్మాగాంధీ (నల్లగొండ) యూనివర్సిటీల్లో గ్రూప్-1, 2, 3, 4, పోలీస్, ఎక్సైజ్, టీచర్ పోస్టులతోపాటు మెడికల్, ఇతర పోస్టులకు కోచింగ్ ఇస్తామని తెలిపారు. వర్సిటీ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీయే కాకుండా ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.
శిక్షణకు ఉన్నత విద్యామండలి నిధులు
ఉచిత శిక్షణకు తెలంగాణ ఉన్నత విద్యామండలి నిధులను సమకూరుస్తున్నది. ఓయూకు రూ.5 లక్షలు, కేయూకు రూ.4 లక్షలు, మిగతా నాలుగు వర్సిటీలకు కూడా నిధులు మంజూరు చేసింది. వీటితో శిక్షణ ఇవ్వడంతోపాటు ఉచిత మెటీరియల్ అభ్యర్థులకు అందజేస్తారు. స్క్రీనింగ్ టెస్టులు లేకుండా వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.