నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఉచిత విద్యుత్తు పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం నుంచి వినియోగదారుల వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. వివరాల సేకరణలో కీలకమైన విద్యుత్ మీటర్ రీడర్స్ తొలి రోజే విధులు బహిష్కరించారు. తమకు ఇస్తున్న వేతనానికి, పనికి సం బంధం లేదని, సమస్యలు పరిష్కరిస్తేనే ముందుకు వెళ్తామని తేల్చి చెప్తున్నారు.
ఈ నెల 15 నాటికి వివరాల సేకరణ పూర్తికావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి వీరి సహాయ నిరాకరణతో తొలి రోజే గండిపడింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని ఎన్నికల్లో ప్రకటించిన కాంగ్రెస్, హామీ అమలుపై సోమవారం ప్రకటన చేసింది. మంగళవారం నుంచి 15వ తేదీ వరకు వినియోగదారుల వివరాలు సేకరించాలని ఆదేశించింది.
ఈ బాధ్యతను ప్రతినెలా మీటర్ రీడింగ్ తీసుకునే రీడర్స్‌కు అప్పగించారు. తమకు ఇచ్చే జీతానికి, పనికి సంబంధం లేదంటూ సేకరణ తమవల్ల కాదంటూ మంగళవారం విధులు బహిష్కరించారు. రీడింగ్ మిషన్లను అధికారులకు అప్పగించి రాష్ట్ర విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు బిల్లుల వసూళ్లలో తమదే కీలక పాత్రని, కానీ తమకు శ్రమకు తగ్గ వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ. 5 వేలే
మీటర్ రీడర్స్ గొడ్డుచాకిరీ చేస్తున్నప్పటికీ వారికి నెలకు చేతికి అందేది రూ. 4-5 వేలే. ఒక్కో మీటర్ రీడింగ్‌కు రెండు రూపాయలు కమిషన్ ఇస్తారు. ఒక్కొక్కరు సగటున రెండువేల మీటర్ల రీడింగ్ తీయాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ పోల్స్ నంబర్లు అంటూ రకరకాల పనులు చేయిస్తున్నారు.
ఈ నెల ఇప్పటికే మీటర్ రీడింగ్ ప్రారంభం కాగా వినియోగదారుల ఫోన్ నంబర్లు సేకరించే పని అప్పగించారు. అది కొనసాగుతుండగానే వినియోగదారుడి రేషన్‌కార్డు నంబర్, ఆధార్ నంబర్లు సేకరించాలని ఆదేశించారు. ఇవన్నీ సేకరించేందుకు ఒక్కో ఇంటి వద్ద అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. దీనికితోడు యజమానులు, అద్దెకుండేవారు అంటూ మరో సమస్య కూడా ఉంది.
వీటన్నింటికితోడు టార్గెట్లు. ఇంత ఒత్తిడి మధ్య పనిచేయడం తమ వల్ల కాదని, పనికి సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు నెరవేర్చే వరకు గృహజ్యోతి వివరాల సేకరణకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 2500 మంది విద్యుత్తు మీటర్ రీడర్లు విధులు బహిష్కరించి మంగళవారం సమ్మెలోకి వెళ్లారు.
వివరాలు మళ్లీ ఎందుకు?
ఆరు గ్యారెంటీల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో భాగంగా గృహజ్యోతి పథకానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్లతోపాటు విద్యుత్తు సర్వీసు నంబరు, ఫోన్ నంబరు వంటి అన్ని వివరాలు అందులో ఉన్నాయి.
దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రజల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్న తర్వాత కూడా మళ్లీ కొత్తగా వివరాల సేకరణ ఎందుకున్న ప్రశ్న తలెత్తింది. ప్రభుత్వ తీరు చూస్తుంటే వివరాల సేకరణ పేరుతో పథకం అమలును మరింత జాప్యం చేయబోతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నది
నెలనెలా కరెంటు మీటర్ రీడింగ్ తీయడమే మా బాధ్యత. సంస్థకు సంబంధించిన ప్రతి పనినీ మాతోనే చేయిస్తున్నారు. ఇప్పటికే పోల్ నంబర్, ట్రాన్స్ఫార్మర్ నంబర్, ఫోన్ నంబర్లు సేకరిస్తున్నాం. ఇప్పుడు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్లు కూడా సేకరించాలని అధికారులు చెప్తున్నారు. పని ఒత్తిడి తీవ్రంగా ఉంటున్నది. పనికి తగ్గ వేతనం ఇవ్వాలన్నదే మా డిమాండ్. అది నెరవేర్చే వరకు గృహజ్యోతి వివరాల సేకరణను బహిష్కరిస్తాం.
– మేడి యాదగిరి, మీటర్ రీడర్
సమస్యలు పరిష్కరించాలి
క్షేత్రస్థాయిలో విద్యుత్తు బిల్లుల వసూళ్లలో మేమే కీలకం. ఇంటింటికీ తిరిగి మీటర్ రీడింగ్‌లో తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నాం. ఒక్క మీటర్ రీడింగ్ మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మేమే చేయాల్సి వస్తున్నది. ఒక్కో మీటర్ మీద ఇచ్చే కమీషన్ అంతా కలిపి నాలుగైదు వేలు కూడా రాదు. మేము చేసే పనికి ఇస్తున్న వేతనానికి పొంతన లేదు. మమ్మల్ని కూడా ఆర్టిజన్స్‌గా గుర్తించాలి. అప్పటివరకు మేము గృహజ్యోతి వివరాల సేకరణను నిలిపివేస్తాం.
– గుండ్లపల్లి వెంకన్న, యూనియన్ లీడర్, నల్లగొండ