ఆర్మూర్‌టౌన్/నిర్మల్(నమస్తే తెలంగాణ), సెప్టెంబర్ 1: క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ పేరిట అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులతో ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న బిట్‌కాయిన్ ముఠా గుట్టును నిర్మల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. నిందితుల్లో ఆర్మూర్ ఎక్సైజ్ ఎస్సై గంగాధర్ కూడా ఉన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. కడెం మండలంలోని నవాబ్‌పేట్‌కు చెందిన సల్ల రాజ్‌కుమార్, సాయికిరణ్‌తోపాటు నిర్మల్‌కు చెందిన కండెల నరేశ్, గంగాధర్, మహేశ్ బిట్‌కాయిన్ పేరిట ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. రూ. లక్ష పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.14 వేలు వస్తాయని చాలా మంది అమాయకులను దందాలోకి దించినట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. కొంతమంది అప్పు లు చేసి మరీ ఇందులో పెట్టుబడి పెట్టినట్టు తమ దృష్టికి రావడంతో విచారణ జరిపామని, ఎక్సైజ్ ఎస్సై గంగాధర్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు.