పెనుబల్లి, జూలై 26: ఎంపీడీవోనని చెప్పుకుంటూ పేదల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండల కేంద్రానికి చెందిన అద్దంకి దయాకర్‌రావు తాను మచిలీపట్నం ఎంపీడీవోనని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మాజీ న్యాయసలహా మండలి నిపుణుడు, పాటిబండ్ల చంద్రశేఖర్‌రావు పేరిట ఓ ట్రస్టు ఏర్పాటు చేసుకున్నాడు.
పెనుబల్లి మండలం పాతకుప్పెనకుంట్లలో ట్రస్టు తరఫున ఇళ్లు కట్టిస్తానని చెప్పి 20 మందిని ఎంపిక చేశాడు. దీనికి సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయితో ఈ నెల 8న శంకుస్థాపన చేయించారు. గ్రామానికి చెందిన నారపోగు శ్రీనివాసరావు, నారపోగు రవికుమార్, కంటేపుడి ఏసు, నారపోగు నాగరాజు నుంచి రూ.4 వేలు చొప్పున రూ.16 వేలు వసూలు చేశాడు. దీంతో దయాకర్‌రావు ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణ చేయాలని పోలీసులకు సూచించారు. నారపోగు శ్రీనివాసరావు వీఎం బంజర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దయాకర్‌రావును అరెస్టు చేశారు. అతడిపై 1992 నుంచి చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు. ట్రస్టు పేరిట మోసాలకు పాల్పడేవారిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.