హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23: హనుమకొండ జిల్లా కేంద్రంలోని నయీమ్‌నగర్‌లో ఉన్న తేజస్వీ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే హనుమకొండలోని గణేశ్‌నగర్ గుండ్లసింగారానికి చెందిన బానోత్ సుజాత-రమేశ్ దంపతుల కొడుకు బానోత్ సుర్జీత్ ప్రేమ్(9) తేజస్వీ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం పాఠశాలలో ఆకస్మాత్తుగా పడిపోగా, సిబ్బంది స్థానిక దవాఖానకు తరలించారు.
పరీక్షించిన వైద్యులు సుర్జీత్ ప్రేమ్ బ్రెయిన్‌డెడ్‌తో మృతిచెందినట్టు నిర్ధారించారు. సమాచారమందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని సుర్జీత్ మృతిపై అనుమానం వ్యక్తంచేశారు. తమ కొడుకు ఆరోగ్యంగా ఉన్నాడని, సిబ్బంది కొట్టడం వల్లే చనిపోయాడంటూ ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని, బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ నర్సింగరావు సిబ్బందితో కలిసి పాఠశాల వద్దకు చేరుకున్నారు. మరోవైపు యాజమాన్యం పాఠశాలకు తాళం వేసి పరారయ్యారు. దీంతో బంధువులు రాళ్లతో స్కూల్బోర్డుపై దాడి చేశారు. సెప్టెంబర్ 11న ఇదే పాఠశాలలో పదో తరగతి విద్యార్థి జయంత్వర్ధన్ మృతి చెందగా, తాజాగా మరో ఘటన జరగడం సంచలనంగా మారింది. ఘటనపై విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.