Contributors | మణికొండ, మార్చి 13: ప్రధాన మీడియా సంస్థల్లో కంట్రిబ్యూటర్లు (విలేకరులు)గా పనిచేస్తున్న ఐదుగురితోపాటు హోంగార్డు దంపతుల వేధింపులకు ఓ కుటుంబం బలైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరులో తన ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విలేకరుల వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారించారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగటూరుకు చెందిన నీరటి రవి (40) తన ముగ్గురు కుమారులను ఈ నెల 3న ఇంట్లోనే ఉరి వేసి చంపడంతోపాటు తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెనక బెదిరింపులు, ఆర్థిక వేధింపులే కారణమని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం నార్సింగి ఏసీపీ కార్యాలయంలో మీడియాకు కేసు వివరాలను ఆయన వివరించారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులని, ఇప్పటికే ముగ్గురు విలేకరులను అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే అందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు.
డీసీపీ వివరాల ప్రకారం.. అసలు ఏం జరిగిందంటే..
టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి జుల్కల్లోని అగ్రికల్చర్ ఆఫీస్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసేవాడు. రవి 2022లో ఏపీలోని గుంటూరుకు వెళ్లగా, తిరుపతిరావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విజయనగరానికి చెందిన జీఎస్ఎన్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ గురించి వివరించి రవిని సభ్యుడిని చేర్పించాడు. జీఎస్ఎన్ ఫౌండేషన్‌లో తొలుత రూ.2 వేలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వడంతోపాటు ఆ తర్వాత ప్రతి నెల వెయ్యి చొప్పున ఆరు నెలల వరకు ఇచ్చేవారు.
అదే ఏడాది డిసెంబర్ నుంచి తన గ్రామంలోని చాలా మందితో జీఎస్ఎన్ ఫౌండేషన్‌లో రవి పెద్ద మొత్తంలో డబ్బులను కట్టించాడు. సేకరించిన మొత్తాన్ని తిరుపతిరావుకు పంపించేవాడు. తిరుపతిరావు నెలనెలా డబ్బులను రవికి పంపగా అతడు సభ్యులకు చెల్లించేవాడు. ఇలా బాగా సంపాదించడంతో ఎనిమిది నెలల క్రితం రవి గ్రామంలోని ఒకరి వద్ద ఎకరం భూమి కొనుగోలుచేసి అందులో తన ముగ్గురి పిల్లల పేరు మీద ‘ఎస్ఎంయూ’ ఫంక్షన్‌హాల్‌ను నిర్మిస్తున్నాడు.
మూడు నెలలుగా అందని డబ్బులు
గత మూడు నెలల నుంచి తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో జీఎస్ఎన్ ఫౌండేషన్‌లో సభ్యులుగా చేసిన గ్రామస్థులతోపాటు ఇతరులు డబ్బుల గురించి రవిని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో శంకర్పల్లి మండలానికి చెందిన కొందరు విలేకరులు మంగలి శ్రీనివాస్ (ఏబీఎన్ న్యూస్‌చానల్ రిపోర్టర్), కురుమ శ్రీనివాస్ (ఈనాడు), వడ్డె మహేశ్ (నమస్తే తెలంగాణ), సిరిపురం శ్రీనివాస్‌రెడ్డి (వార్తా), సనికె ప్రవీణ్‌కుమార్ (సాక్షి) రవిని బెదిరించడం మొదలుపెట్టారు.
ఈ విషయం తమ న్యూస్‌పేపర్లు, మీడియాలో రాకుండా ఉండేందుకు రూ.20 లక్షలు ఇవ్వాలని వీరు బ్లాక్మెయిల్ చేశారు. దీంతో రవి గతనెల 19న తన భార్య శ్రీలత పుస్త్తెలతాడు, నల్లపూసల దండ తాకట్టు పెట్టి రూ.2.5 లక్షలను అడ్వాన్సుగా ఐదుగురు విలేకరులకు చెల్లించాడు. విలేకరులతోపాటు జీఎస్ఎన్ సంస్థలో పెట్టుబడినందున ఆలూరి రాజు అలియాస్ నాగరాజు (హోంగార్డు-4550), ఇతడి భార్య మనీలా, రామకృష్ణ అనే వ్యక్తులు కూడా డబ్బుల గురించి రవిని ఎక్కువగా ఒత్తిడి చేశారు. ‘నువ్వు ప్రజల వద్ద డబ్బులు కట్టించి తిరిగి వారికి ఇవ్వకుండా మోసం చేస్తున్నావు.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్నావు’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. రవి తన భార్య పేరున ఉన్న రావులపల్లిలోని రెండు ప్లాట్ల డాక్యుమెంట్లను తాకట్టు పెట్టి తెచ్చిన రూ.18 లక్షలను హోంగార్డు దంపతులతోపాటు రామకృష్ణకు చెల్లించాడు. మిగతా డబ్బుల కోసం విలేకరులు తీవ్రంగా ఒత్తిడి చేయగా..వారి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే తన ముగ్గురు కుమారులు సాయికిరణ్, మోహిత్, ఉదయ్‌కిరణ్ అనాథలవుతారని భావించాడు.
మార్చి 3న రవి తన ఇంట్లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఫంక్షన్‌హాల్ వద్దకు వెళ్లి రేకుల షెడ్డులో ఉరివేసుకుని చనిపోయాడు. నలుగురి ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులైన ఐదుగురు విలేకరులలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న జీఎస్ఎన్ సంస్థ లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు. సమావేశంలో ఏసీపీ రమణాగౌడ్, సీఐ వీరబాబు, ఎస్సై కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
వేధింపుల నిందితులు
ఏ1-తిరుపతిరావు
ఏ2- మంగలి శ్రీనివాస్ (ఏబీఎన్ న్యూస్‌చానల్ రిపోర్టర్)
ఏ3- కురుమ శ్రీనివాస్ (ఈనాడు )
ఏ4- వడ్డె మహేశ్ (నమస్తే తెలంగాణ)
ఏ5- సిరిపురం శ్రీనివాస్‌రెడ్డి (వార్తా)
ఏ6- సనికె ప్రవీణ్‌కుమార్ (సాక్షి)
ఏ7- ఆలూరి రాజు (హోంగార్డు-4550)
ఏ8- హోంగార్డు భార్య మనీలా
ఏ9- రామకృష్ణ (జీఎస్ఎన్ స్కీమ్ సభ్యుడు)