హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల్లో నలుగురు విద్యార్థులూ అత్యధిక మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. వారు 600 మార్కులకు 597 మార్కులు సాధించి సత్తాచాటారు. కుంచాల వృతికా కృష్ణ (ఖమ్మం), మేధాన్స్ శ్రీరామ్ (రంగారెడ్డి),ఎంటెనుక శశాంశ్ (సంగారెడ్డి), ముద్దాయిపేట మధు (సంగారెడ్డి) 600 మార్కులకు మూడు మార్కులు మాత్రమే తగ్గాయి. టాప్ -10లో ఈ నలుగురు 597 మార్కులు సాధించగా, మరో ఆరుగురు విద్యార్థులు 596 మార్కులు సాధించారు. టాప్ -10 విద్యార్థుల్లో ఆరుగురూ గ్రేటర్ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం.
ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రధాన పరీక్షలు జూన్ 10వ తేదీతోనే ముగుస్తాయి. పరీక్షల పూర్తి షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. రెగ్యులర్ పరీక్షల్లో ఒక పరీక్షకు మరో పరీక్షకు మధ్య మూడు, నాలుగు రోజుల వ్యవధినిచ్చారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎలాంటి వ్యవధిని ఇవ్వలేదు. పరీక్ష ముగిసిన తెల్లారే మరో పరీక్ష నిర్వహిస్తారు.ఆదివారం సైతం పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలు రాసేవారు మే 14లోపుపాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి సూచించారు.
