చేగుంట, మే 21: బంధువు దశదిన కర్మకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆదివారం ఉదయం మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన తిప్ప శేఖర్, కవిత భార్యాభర్తలు. వీరికి కుమారులు యశ్వంత్, అవినాశ్ ఉన్నారు. వీరు బతుకుదెరువు కోసం కొన్ని రోజుల కిందట నిజామాబాద్ జిల్లా ఆలూరు వెళ్లారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన వృద్ధ దంపతులు బాలనర్సయ్య, మణెమ్మ, కవితకు దగ్గరి బంధువులు. వీరు ఆలూరులోని కవిత ఇంటికి వచ్చారు. కాగా ప్రజ్ఞాపూర్‌లో మరో బంధువు దశదిన కర్మ ఉండటంతో వీరంతా ఆలూరు నుంచి సొంత ఆటోలో బయలుదేరారు. నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తిప్పా శేఖర్ (45), అతడి కుమారుడు యశ్వంత్ (10), వృద్ధ దంపతులు బాలనర్సయ్య (70), మణెమ్మ(62) అక్కడికక్కడే మృతి చెందారు. కవిత, మరో కొడుకు అవినాశ్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై నర్సింహులు తెలిపారు.