నందిగామ/సుల్తాన్‌బజార్, జనవరి 7: రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో నలుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి శివారులో ఓ భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కార్యదర్శిని కలిశాడు. ఆయన సూచన మేరకు ఎంపీడీవో, ఎంపీవోను కూడా కలువగా అనుమతి కావాలంటే రూ.2.5 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.1.5 లక్షలను సదరు వ్యక్తి ఇటీవలే అడ్వాన్స్‌గా అందజేశాడు. మిగతా రూ. లక్షను బుధవారం నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్‌సింగ్, ఈదులపల్లి పంచాయతీ కార్యదర్శి చెన్నయ్యకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కేసు నమోదు చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. హైదరాబాద్‌లోని బాగ్ అంబర్పేటలోగల సర్వే నంబర్ 616 భూమిని సర్వే చేసి నివేదిక జారీ చేయడానికి ఓ వ్యక్తి నుంచి ఎండోమెంట్ విభాగం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ ఇన్స్పెక్టర్ ఆకవరం కిరణ్‌కుమార్ రూ.1.5 లక్షలు డిమాండ్ చేశాడు. అడ్వాన్స్‌గా రూ.50 వేలను బుధవారం ఎండోమెంట్ కార్యాలయం పక్కన తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సదరు ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.