హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరిందని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. కొత్తగా పాజిటివ్ వచ్చినవారిలో ముగ్గురు కెన్యా దేశస్తులని, ఒకరు భారత్‌కు చెందినవారని పేర్కొన్నారు. వీరిలో ఒకరు మాత్రమే రిస్క్ దేశం నుంచి వచ్చారని వెల్లడించారు. ఇందులో ఒకరు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లారని, మిగిలిన వారిని టిమ్స్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. రిస్క్ దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ విమానాశ్రయానికి 6,764 మంది ప్రయాణికులు రాగా.. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 21 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.
190 మందికి కరోనా పాజిటివ్
రాష్ట్రంలో గురువారం కొత్తగా 190 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో 80, రంగారెడ్డిలో 14, మేడ్చల్ మల్కాజిగిరిలో 13, హన్మకొండలో 12, మహబూబాబాద్‌లో 10 కేసులు నమోదయ్యాయి. కరోనా, ఇతర వ్యాధులతో ఇద్దరు మరణించారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇండ్లు, దవాఖానల్లో 3,805 మంది చికిత్స పొందుతున్నారు. 195 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో రెండో డోస్ కొవిడ్ టీకా వేసుకొనేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 3.81 లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తం టీకాల సంఖ్య 4.26 కోట్లకు చేరింది.