హైదరాబాద్: రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఇప్పటివరకు సాధారణ పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రుల ఇండ్లలోనే చోరీలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమెరాలతో నిఘా ఉండే రాజ్‌భవన్‌లో(Raj Bhavan) దొంగతనం జరిగింది. గవర్నర్ అధికార నివాసంలోకి దర్జాగా వెళ్లిన ఓ వ్యక్తి.. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్‌లోకి చొరబడి హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు. ఇంతకూ ఇది ఇంటి దొంగల పనా లేదా మరెవరి పాత్రైనా ఉన్నదా?
నిత్యం హై సెక్యూరిటీతో, సీసీ కెమెరాల నిఘాలో ఉండే రాజ్‌భవన్‌లో ఓ అంగతకుడు చోరీకి పాల్పడ్డాడు. రాజ్ భవన్ సుధర్మ భవన్లో విలువైన హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లాడు. మే 14న రాత్రి హెల్మెట్ ధరించి వచ్చిన వ్యక్తి సుధర్మ భవన్లో మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీల్లో గుర్తించారు. మొత్తం నాలుగు హార్డ్ డిస్క్‌లు మాయమైనట్లు సిబ్బంది నిర్ధారించారు. ఈ మేరకు రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలతోపాటు.. కీలకమైన కొన్ని రిపోర్ట్లు, ఫైళ్లు ఉన్నట్టు తెలుస్తున్నది. అసలు ఆరోజు హెల్మెట్‌తో కంప్యూటర్ రూమ్‌లోకి ఎవరు వెళ్లారనే దానిపై పోలీసులు దృష్టిసారించారు.