హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. థర్డ్ వేవ్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. పలు సూచనలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వందకు వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వైద్యారోగ్య శాఖ ముమ్మరం చేసింది. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కలిసి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు.
ఈ చర్యల ఫలితంగా రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మొత్తంగా 4,00,45,178 డోసులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేరింది. 2,61,09,999 మందికి కొవిడ్ టీకా మొదటి డోసు పూర్తి కాగా, 1,39,35,179 మందికి రెండో డోసు పూర్తయింది.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కు దాటిన సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌పై పోరులో ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ త్వరగా టీకా తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రతి పౌరుడు సురక్షితంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
Telangana has successfully administered over 4 Cr #CovidVaccine doses so far. Thanking every citizen of #Telangana who have taken a step towards defeating #COVID19.It is my humble appeal to every citizen to stay safe & get themselves & their loved ones vaccinated at the earliest. pic.twitter.com/Tcw8GzKjrf
— Harish Rao Thanneeru (@trsharish) December 9, 2021