హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కలుషితాహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమానికి చెందిన పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉన్నారు. ఆదివారం ఉదయం కలుషిత ఆహారం తిని 27 మంది అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హుటాహుటిన దవాఖానకు తరలించారు. విద్యార్థుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండగా, చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులు జాషువా, భవాని, శ్రద్ధ, నిత్య మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.