హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో నలుగురిని అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితుల్లో స్వాతి పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ అడ్మిన్ ఆఫీసర్ గిడ్డా కృష్ణమూర్తి, చీఫ్ సూపరింటెండెంట్ సముద్రాల వెంకటేశ్వర్లు, సంయుక్త సూపరింటెండెంట్ కేశెట్టి కృష్ణమోహన్, పరీక్షల అబ్జర్వర్, ప్రభుత్వ కెమిస్ట్రీ లెక్చరర్ మంద వెంకటరాంరెడ్డి ఉన్నట్టు చెప్పారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్ష ప్రశ్నపత్రాలను వీరంతా కలిసి లీక్చేసినట్టు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో షేర్కావడంతో లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, డీవీఆర్, రిజిస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్లాన్ ప్రకారం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. కొంత సమాచారాన్ని డిలీట్ చేశారు. కళాశాల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను డీవీఆర్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కేసు దర్యాప్తు సాగుతున్నదని పోలీసులు తెలిపారు.