హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ఫౌండేషన్ లెర్నింగ్ సర్వేను (ఎఫ్ఎల్ఎస్) రాష్ట్రంలో కొందరికే నిర్వహించడం వివాదాస్పదమైంది. పలు స్కూళ్లల్లో రచ్చకు దారితీసింది. ఎంపికచేసిన కొందరు విద్యార్థులకే పరీక్ష నిర్వహించడంపై తల్లిదండ్రులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అలాంటప్పుడు విద్యార్థులందర్ని ఎందుకు సన్నద్ధంచేశారని, మాక్టెస్ట్ల పేరిట సమయం ఎందుకు వృథా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎఫ్ఎల్ఎస్ సర్వేను సోమ, మంగళవారాల్లో నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి ఇది ర్యాండమ్ సర్వే. ఈ పరీక్ష కోసం విద్యాశాఖ నాలుగైదు నెలలుగా విద్యార్థులను సన్నద్ధం చేసింది. మాక్ టెస్ట్లు నిర్వహించింది. తీరా చూస్తే ప్రతి మండలంలో రెండు స్కూళ్లల్లోనే పరీక్ష నిర్వహించారు.
అది కూడా స్కూల్కు 12 మంది విద్యార్థులకే పరీక్ష నిర్వహించారు. కొందరికే పరీక్ష నిర్వహించడంతో ఉప్పల్ కేవీ స్కూళ్లో తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. చాలా బడుల్లో ఇదే తరహాలో తల్లిదండ్రులు నిరసన వ్యక్తంచేశారు. ఇదే విషయంపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ స్పందిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఈ సర్వే నిర్వహణకు రాష్ట్రంలోని 407 స్కూళ్లను మాత్రమే ఎంపికచేసిందని తెలిపారు. సోమవారం ఆరుగురు, మంగళవారం ఆరుగురికి మాత్రమే పరీక్ష నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇది ట్యాబ్బేస్డ్ ర్యాండమ్ సర్వే కావడంతో విద్యార్థులందరిని పరీక్షకు సన్నద్ధం చేశామన్నారు. ఆయా అంశాలపై ఇప్పటికే సూచనలు చేశామని వెల్లడించారు.