నందికొండ, ఫిబ్రవరి 9 : ఉపనయనానికి వచ్చి సాగర్ నీటిలో స్నానం చేసేందుకు దిగిన ముగ్గు రు మృతిచెందారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన కేశవపంతుల వేంకటేశ్వరశర్మ నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్చార్జిగా పనిచేస్తూ హైదరాబాద్‌లోని బోడుప్పల్లో నివాసముంటున్నారు.
తన పెద్ద కుమారుడు చతుర్వేది ఉపనయన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బంధువులతో కలిసి గురువారం నాగార్జునసాగర్ వెళ్లారు. పైలాన్ కాలనీలోని శివాలయం వద్ద ఉపనయన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 7 గంటల సమయంలో వేంకటేశ్వరశర్మ చిన్న కొడుకు వాచస్పతి (18), ఆయన అన్న కుమారుడు చంద్రకాంత్ (21), బావమర్ది నాగరాజు (39) శివాలయ పుష్కరఘాట్‌లో స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభం కావడంతో ఒకేసారి నీటి ప్రవాహం పెరిగింది.
దాంతో పుష్కరఘాట్ వద్ద స్నానం చేస్తున్న ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉపనయన కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు.. అంతలోనే ముగ్గురు నదిలో కొట్టుకుపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. కాగా శుక్రవారం ఉదయం నాగరాజు కుమారుడి ఉపనయనం జరగాల్సి ఉండగా, నాగరాజు కూడా నదిలో కొట్టుకుపోయి మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా వాచస్పతి గ్వాలియర్ ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతుండగా, నాగరాజు ఇటీవలే గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై అయినట్టు సమాచారం.