హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): అక్రమ కేసులు, అరెస్టులతోనూ బీఆర్ఎస్ నాయకులను బలహీనపరచాలనే రేవంత్‌రెడ్డి సర్కారు కుట్ర చెల్లబోదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ఎన్నిరకాల అక్రమ కేసులు పెట్టినా ప్రశ్నించడంపైన వెనక్కి తగ్గేది లేదని, రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసే దాకా వెంటపడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కారు రేసు కేసులో అవినీతి జరిగిందని నిర్ధారించలేదని, విచారణకు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టంచేశారు. తమ లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు.
హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, పార్టీ నేతలు దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్‌తో కలిసి హరీశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఎగ్గొట్టడం వల్ల ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురొంటున్నదని, అన్ని సర్వే రిపోర్టులు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ప్రశ్నించినందుకే అటెన్షన్ డైవర్షన్ కోసం ఈ కేసు పెట్టారని విమర్శించారు.
ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణను తెచ్చుకున్నం. తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, అక్రమ కేసుల్లో ఇరికించినా 420 హామీలు అమలుచేసే దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటం.
-హరీశ్‌రావు
ఈ కేసులో అవినీతి జరిగిందని హైకోర్టు నిర్ధారించలేదదు. అవినీతి ఉన్నదని శిక్ష వేసిన తీర్పు కాదు. ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పినప్పుడు.. విచారణ చేసుకోండని కోర్టు పేర్కొన్నది. కేటీఆర్ ఎలాంటి తప్పూ చేయలేదు. విచారణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తరు.
-హరీశ్‌రావు
ఈ కార్ రేసులో హైకోర్టు విచారణ కొనసాగించాలని మాత్రమే చెప్పింది తప్ప శిక్ష విధించాలని కాదని హరీశ్ స్పష్టం చేశారు. కేటీఆర్ ఎలాంటి తప్పూ చేయలేదని, విచారణకు సహకారిస్తారని వెల్లడించారు. గతంలో కూడా విచారణకు సిద్ధమని కేటీఆర్ చెప్పారని, ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా? లేదా అనే అంశాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ నిర్ణయిస్తుందని తెలిపారు. హైకోర్టు తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత లీగల్ సెల్ సలహా మేరకు తదుపరి కార్యాచరణ చేపడతామని న్యాయస్థానాల మీద, చట్టాల మీద తమకు గౌరవం ఉన్నదని, సుప్రీంకోర్టులో కొట్లాడుతామని స్పష్టంచేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి డబ్బుల కట్టలతో కెమెరాల ముందు అడ్డంగా దొరికి జైలుకు పోయారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టుకు, కేటీఆర్‌పై అక్రమ కేసుకు పోల్చడం సరికాదని హితవుపలికారు.
ఈ కేసులో రూపాయి కూడా చేతులు మారనప్పుడు అవినీతి ఎట్లా అవుతుందని హరీశ్ నిలదీశారు. ‘గ్రీన్కో సంస్థకు రూపాయి లబ్ధి చేయనప్పుడు వారు ఎందుకు మాకు తిరిగి డబ్బులు ఇస్తారు? అదే కంపెనీ ఫార్ములా ఈ నిర్వహణలో భారీగా నష్టపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి డబ్బులు వచ్చాయనడం అర్థరహితం. కేటీఆర్‌పై పెట్టింది తుఫేల్ కేసు’ అని పేర్కొన్నారు. సోమవారం ఏసీబీ దగ్గరికి కూడా విచారణ ఎదురోవడానికి కేటీఆర్ వెళ్లారని గుర్తుచేశారు. పోలీసులు 45 నిమిషాలు ఆపినా కేటీఆర్ ఓపిగ్గా వేచి చూశారని, కచ్చితంగా విచారణను ఎదురొంటామని, 9న కూడా విచారణకు వెళ్తారని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచడం కోసమే ఫార్ములాఈని కేటీఆర్ హైదరాబాద్‌కు తెచ్చారని గుర్తుచేశారు. ఇదే రేసును తమ రాష్ట్రాలకు, నగరాలకు తీసుకురావడానికి అనేక రాష్ర్టాలు పోటీపడ్డాయని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారని, కేటీఆర్ వెల్లడించే వరకు ఈ విషయాన్ని ఎందుకు రేవంత్ బయటపెట్టలేదని నిలదీశారు.
ఎలాంటి తప్పూ చేయలేదన్న ధైర్యం ఉన్నది కాబట్టే విచారణకు వెళ్తున్నామని, కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకొస్తారని హరీశ్ ధీమా వ్యక్తంచేశారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షమేనని స్పష్టంచేశారు. కేటీఆర్‌పై పెట్టిన కేసులుగాని, పార్టీ నేతలపైన పెడుతున్న కేసులనుగాని పార్టీ చట్టపరంగా ఎదుర్కొంటుందని వెల్లడించారు.
రేవంత్‌రెడ్డి తప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ అడుగడుగునా ప్రశ్నించినందుకే అటెన్షన్ డైవర్షన్ కోసం ఫార్ములా ఈ-కారు రేసు కేసు పెట్టిండ్రు. మానసికంగా బలహీనపర్చాలని చూస్తున్నరు. ఇలాంటి అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులపై భవిష్యత్తులో ఇంకా పెడుతరు. వాటిని ఎదుర్కోడానికి మేం సిద్ధంగా ఉన్నం.
-హరీశ్‌రావు
కోర్టులు, అధికారులపై తమకు విశ్వాసం ఉన్నదిగాని రేవంత్‌రెడ్డిపైన లేదని హరీశ్ పేర్కొన్నారు. లగచర్ల కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. కోర్టు తీర్పుపైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విచారణ ప్రారంభం కాకముందే తప్పు జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల పైన చిచ్చరపిడుగుల్లా పోరాడిన చరిత్ర తమదని, గతంలో అరస్టై కేటీఆర్ వరంగల్ జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. అక్రమ అరెస్టులకు భయపడబోమని స్పష్టంచేశారు.
నాడు రేవంత్‌రెడ్డి అరెస్టయి జైల్లో పడడానికి.. ఈ కేసుకు పొంతనలేదు. తెలంగాణ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడాన్ని, కేటీఆర్ అక్రమ కేసుతో పోల్చడమంటే మోకాలికి బోడిగుండుకు ముడివేయడమే.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ):ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై అవగాహనలేదని, ఆయన పరిణతిలేని పాలన సాగిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేస్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, దీనిని హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. ఈ-రేస్‌ను హైదరాబాద్‌కు తీసుకొనిరావడానికి కేటీఆర్ ప్రదర్శించిన స్ఫూర్తిని అర్థం చేసుకునే పరిణతి లేదని, కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో అన్ని రాష్ట్రాలను మించి తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపేందుకు కేసీఆర్ నాయకత్వంలో భగీరథ ప్రయత్నం జరిగిందని వివరించారు.
దేశంలో తెలంగాణ అంటే అభివృద్ధికి చిరునామాగా నిలిపింది బీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు. పదేండ్లపాటు అద్భుతంగా సాగిన తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం ఏడాదిగా కాంగ్రెస్ పాలనలో కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలను అమలుచేయలేక చతికిలపడిందని, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేటీఆర్‌పై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.