KTR | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తాను మొదటినుంచి చెప్తున్నట్టు ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పునరుద్ఘాటించారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన రూ.45 కోట్లు అకడి బ్యాంకు అకౌంట్లో భద్రంగా ఉన్నాయని, ఎకడా నిధుల దుర్వినియోగం జరుగలేదని స్పష్టంచేశారు. ఇందులో ఏమీలేదని ప్రభుత్వమే చార్జిషీట్లో ఒప్పుకున్నదని చెప్పారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు చార్జిషీట్ తెచ్చారని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సరార్ పూర్తిగా ఇరకాటంలో పడిందని చెప్పారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. న్యాయస్థానాలపై తమకు సంపూర్ణ నమ్మకం ఉన్నదని, చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తనపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ సర్కార్ అధికారులను వేధించడం సరైనది కాదని హితవుపలికారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం గోరంతను కొండంతగా చిత్రీకరిస్తున్నదని విమర్శించారు. ఇక్కడి నుంచి రూ.45 కోట్లు పంపితే రూ.600-700 కోట్లని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి అభూత కల్పనలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని స్పష్టంచేశారు. అసలు ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తున్నదో వారి పేరే చార్జిషీట్లో లేదని చెప్పారు. సంస్థ ఖాతాలో భద్రంగా ఉన్న నిధులను ప్రభుత్వం వెనకి తెప్పించవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రతిష్ఠాత్మక ఈ-కార్ రేసును నగరానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. తొలిసారి నిర్వహించిన ఈ రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టంచేసిందని తెలిపారు. రెండోసారి దురుద్దేశంతో ముఖ్యమంత్రి రేసును రద్దు చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శించారు. తమకు న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉన్నదని, ఈ కేసులో చివరికి న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
మూసీ అభివృద్ధిపై ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతున్నదని కేటీఆర్ ఆక్షేపించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు. ప్రణాళిక లేదు. అవసరమైన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా లేదు. కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్లు పైసలు ఇస్తారనే ఆశతో (ఇప్పటివరకు ఇవ్వలేదు) కాంగ్రెస్ వాళ్లు ముందుకెళ్తున్నారు’ అని విమర్శించారు. అందుకే మూసీ ప్రాజెక్టుపై తమ పార్టీ లైన్, అభిప్రాయాన్ని ఇటీవల గండిపేటలో నిర్వహించిన పబ్లిక్ పాయింట్ పీపీటీ ప్రజెంటేషన్‌లోనే సమగ్రంగా వివరించామని గుర్తుచేశారు. మళ్లీ కావాలంటే బీఆర్ఎస్ తరఫున ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను తిరిగి మరొకసారి మంత్రులకు కూడా ఇస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఫైవ్‌స్టార్ హోటల్లోనో, సెక్రటేరియట్లో పదిమంది అధికారుల మధ్యనో కాకుండా మూసీ బాధితులతో చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది మూసీ బాధితులు, భయకంపితులైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోరారు. బాధిత ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేవాళ్లు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. మేధా పాటర్లాంటి మేధావులు, ఘంటా చక్రపాణి లాంటి వారు కూడా మూసీ ప్రాజెక్టు ప్రజల అభీష్టం మేరకు జరుగాలని కోరుతున్నారని చెప్పారు.
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 2014లోనే డీలిమిటేషన్ జరుగాల్సిందని, ఆ ప్రక్రియ ఇప్పుడు మొదలైనా సంతోషమేనని, స్వాగతిస్తామని కేటీఆర్ చెప్పారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని, అందువల్ల గతంలో 1971 జనాభా లెకల ప్రకారం ఏ విధంగా చేశారో, అదేవిధంగా ప్రస్తుతమున్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశం నుంచి దేశంలోని 24 శాతం రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉన్నదని, దానికి నష్టం రాకుండా డీలిమిటేషన్ కొనసాగించాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచుతామంటున్నారని, దానిని స్వాగతిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సీట్లు పెంచితే ఎకువ మంది ప్రజా ప్రతినిధులు ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని చెప్పారు. అశ్వారావుపేట లాంటి నియోజకవర్గంలో 1.30 లక్షల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లిలో 9 లక్షల ఓట్లు ఉన్నాయని, కాబట్టి ఇంత భారీ ఓట్ల వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలు అన్నీ ఎకనామిక్ ఇండికేటర్స్‌లో అగ్రభాగాన ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే ఆనాడు చెప్పిన కుటుంబ నియంత్రణ పాటించాయి. కాబట్టి, దక్షిణ భారతదేశానికి, దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగకుండా, వాటి గొంతు కోయకుండా డీలిమిటేషన్ చేస్తే స్వాగతిస్తాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
రేవంత్‌రెడ్డి పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతిరెడ్డి డెవలప్మెంట్ రైట్స్’ అయిపోయాయి. ఎవరెవరి చేతుల్లో ఏ విధంగా టీడీఆర్‌లు మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి.. అనే ప్రతి అంశం మాకు తెలుసు. ఈ భారీ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడుతాం
– కేటీఆర్
ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) విధానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తన కుటుంబానికి ఏటీఎంలా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి ఈ స్కామ్‌ను పూర్తిగా బయటపెడతామని హెచ్చరించారు. టీడీఆర్ అనేది అతి పెద్ద కుంభకోణమని, రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, అనుచరులు టీడీఆర్‌ను అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీసామ్కు తెరలేపబోతున్నారని ఏడాదిన్నర క్రితమే స్పష్టంగా చెప్పానని గుర్తుచేశారు. గత బడ్జెట్ సెషన్లో కూడా టీడీఆర్‌లు కొంటున్నారని, ఆ తర్వాత టీడీఆర్‌లను కచ్చితంగా వాడాలనే నిబంధనలు తీసుకొస్తారని అన్నానని తెలిపారు. ఇప్పుడు కరెక్ట్‌గా అదేవిధంగా బలవంతంగా టీడీఆర్‌లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇది కచ్చితంగా భారీ కుంభకోణమని విమర్శించారు. తమ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈ కుంభకోణంపైన సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. టీడీఆర్ ద్వారా నిర్వాసితుల దగ్గర నుంచి అతి తకువకు కొనుగోలు చేసి అడ్డగోలుగా ఆ టీడీఆర్‌ను అమ్ముకుంటున్న రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పాత్రను బయటపెడతామని హెచ్చరించారు. ‘మొత్తం ఈ టీడీఆర్‌లో ఎవరు అమ్మారు? ఎవరు కొంటున్నారు? ఎవరు ఎవరికి మళ్లీ అమ్ముతున్నారు? అనే ప్రతి వివరాలు తెలిసిపోతాయి కాబట్టి కచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సామ్‌కు పాల్పడుతున్న ప్రతి ఒకరికీ ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతిరెడ్డి డెవలప్మెంట్ రైట్స్’ అయిపోయాయి. ఎవరెవరి చేతుల్లో ఏ విధంగా టీడీఆర్‌లు మారుతున్నాయి. ఎందుకు మారుతున్నాయి.. అనే ప్రతి అంశం మాకు తెలుసు. ఈ భారీ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడతాం’ అని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ అందాల పోటీలు పెట్టడం వల్ల రాష్ర్టానికి పైసా ప్రయోజనం రాకపోగా, అంతర్జాతీయంగా తెలంగాణ అప్రతిష్టపాలైందని కేటీఆర్ విమర్శించారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో మసకబారిందని మండిపడ్డారు. అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం సరదా కోసం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు వృథా చేసిందని ఆరోపించారు. సింగరేణి సంస్థ నుంచి రూ.10 కోట్లు దుర్వినియోగం చేసిందని విమర్శించారు. ఈ రెండు వ్యవహారాల్లో ఎవరిపైన కూడా ఎలాంటి కేసు పెట్టలేదని మండిపడ్డారు. ఎలాంటి తప్పు జరుగని ఫార్ములా రేసు కేసు కోర్టులో నిలబడదని, ఇదంతా దృష్టి మళ్లించడానికి చేస్తున్న రాద్ధాంతమని ప్రజలకు కూడా తెలిసిపోయిందని అన్నారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు చార్జిషీట్ తెచ్చారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సరార్ పూర్తిగా ఇరకాటంలో పడింది.
– కేటీఆర్
నాంపల్లి క్రిమినల్ కోర్టులు/ హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకు చెందిన ఎఫ్ఈవో సంస్థను చేర్చారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులను విదేశీ సంస్థలకు మళ్లించినట్టు ఏసీబీ అధికారులు ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, సహా పలువురిని ఏసీబీ, ఈడీ అధికారులు పలుమార్లు విచారించారు. చార్జిషీట్లో నిందితులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వాములు అయ్యారని, ఇతరులకు లాభం కలిగించేలా ప్రవర్తించారని ఏసీబీ అధికారులు చార్జిషీటులో పేర్కొన్నట్టు తెలిసింది.