మంచిర్యాల, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల ముందు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో మంత్రి వివేక్ వెంకటస్వామి సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్కు రాజీనామా చేసిన రాజిరెడ్డి త్వరలోనే తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. మున్సిపల్ ఎన్నిల ముందు ఆయన రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి.
మూల రాజిరెడ్డికి చెన్నూర్ పట్టణంతోపాటు చెన్నూర్, కోటపల్లి మండలాల్లో బలమైన అనుచరగణం ఉన్నది. ఆయన రాజీనామా ప్రభావం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై పడనున్నది. కొన్ని నెలల క్రితం నుంచే మంత్రి వివేక్ వ్యవహరిస్తున్న తీరును రాజిరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అప్పటినుంచి రాజిరెడ్డి పార్టీకి అంటిముట్టనట్టు ఉంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని రాజిరెడ్డి తెలిపారు. ఈ విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజక వర్గంలో స్పష్టంగా కన్పించిందని పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.