యాదగిరిగుట్ట, ఆగస్టు 23: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి హామీలను నెరవేర్చలేక అసమర్థ పాలనను సాగిస్తున్నారని విమర్శించారు. అదిచాలదన్నట్టు రౌడీలను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.
రుణమాఫీ అమలుకాక రాష్ట్రమంతా రైతులు రోడ్లపైకి వస్తుంటే సీఎం స్వగ్రామంలో పరిస్థితి ఎలా ఉందోనని మహిళా జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వెళ్తే కాంగ్రెస్ గూండాలతో దాడి చేయించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో చెంచు మహిళలపై జరిగిన లైంగికదాడి ఘటనపైనా మహిళా మంత్రుల స్పందన కరువైందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు.