ఖైరతాబాద్, ఏప్రిల్ 23: టీజీపీఎస్సీ గ్రూప్-1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అవకతవకలపై హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలను బయటకు తీయాలని, బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అన్యాయం జరిగిన నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ అమలు కాని హామీలిచ్చి నిరుద్యోగులను వాడుకొని వదిలేసిందని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లు చేసిన నిరుద్యోగులపై ప్రభుత్వం పాశవిక దాడులు చేయించిందని మండిపడ్డారు. 16 నెలల్లో నిరుద్యోగులను పిలిచి మాట్లాడిన దిక్కే లేదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నం.55 తీసుకొచ్చిందని, కానీ ఆ వర్గాలన్నింటికీ అన్యాయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చిందని విమర్శించారు. నేడు నిరుద్యోగులను, విద్యార్థులను లాఠీలతో కొడుతూ అరెస్టులు చేయిస్తుంటే.. నాడు బీఆర్ఎస్పై బురదజల్లిన మేధావులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
40 లక్షల నిరుద్యోగులను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ పెద్దలు క్యాబినేట్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో విధ్వంసం జరుగుతుందని, ఓ వైపు హైడ్రా, మరోవైపు మూసీ, లగచర్ల, ఇంకో వైపు హెచ్‌సీయూ భూముల పేరిట దౌర్జన్యకాండ కొనసాగుతుండగా, ప్రశ్నించాల్సిన మేధావులు పదవులకు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే చీటింగ్, కరప్షన్, కలెక్షన్ అని, అలాంటి ఆ పార్టీ నేతలను నిలదీయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. సమావేశంలో తెలంగాణ విఠల్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, నర్సింహ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.