స్పెషల్ టాస్క్ బ్యూరోహైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కొన్ని చానల్స్ పనిగట్టుకొని తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాపోయారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారుతున్నట్టు మీ చానల్లో తప్పుడు కథనాలు ఎలా ప్రసారం చేస్తారని ఒక చానల్ రిపోర్టర్‌ను ఉత్తమ్ ప్రశ్నించారు. ఆ చానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. అటు.. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావుఠాక్రేతో సమావేశమై తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం వెనుక రేవంత్‌రెడ్డి ఉన్నారని అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆయనే పనిగట్టుకొని దుష్ప్రచారం చేయిస్తున్నారని, గతంలో తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వార్‌రూమ్ నుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయాన్ని వివరించినట్టు సమాచారం. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని గుర్తుచేసినట్టు తెలిసింది.