కోరుట్ల, మే 13 : సుదీర్ఘకాలంపాటు గన్ను పట్టి పోరాటాలు చేసిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ.. ఇప్పుడు పెన్ను పట్టి సంచలనం సృష్టించారు. విప్లవోద్యమం నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టిన ఆయన.. బుధవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తెలుగు పరీక్షకు హాజరయ్యారు.
ఇటీవల మావోయిస్టు ఉద్యమాన్ని వీడి జన జీవనంలోకి వచ్చిన దేవ్జీ, అసంపూర్తిగా మిగిలిపోయిన తన విద్యను పూర్తి చేయాలనే సంకల్పంతో ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఈ క్రమంలో బుధవారం కోరుట్ల పట్టణంలోని మాస్ట్రో జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. 43 ఏండ్ల విరామం తర్వాత పరీక్ష హాలులో అడుగు పెట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చినట్టు తెలిపారు.