ఖానాపూర్ టౌన్, జూన్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలుపై ప్రజల పక్షాన సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌పై ఇదివరకే పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో నమోదైన ఈ కేసుల్లో ఇదివరకే కండీషన్ బెయిల్ మంజూరైంది. ఇందులో భాగంగా ప్రతీ బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు హాజరై రిజిస్టర్లో సంతకం చేయాల్సి ఉన్నది.
అందులో భాగంగానే బుధవారం ఆయన తన లాయర్లతో కలిసి ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వెంటనే సంతకం తీసుకొని పంపించకుండా దాదాపు 4 గంటలకు పైగా దిలీప్‌ను నిరీక్షించేలా చేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్ బయట గూమిగూడారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్షపూరిత విధానాలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని కార్యకర్తలు విమర్శలు గుప్పించారు.