కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 19 : పెండింగ్‌లో ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే నక్సల్స్‌గా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు. బుధవారం ఆసంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఫిలింభవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం మాట్లాడుతూ, తమపై బీఆర్ఎస్ ముద్ర వేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం అమానుషమన్నారు. తెచ్చిన అప్పులు తడిసి మోపెడై, తమ కుటుంబాలు దివాళా తీసే పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తయ్యే లోపు నిధులు విడుదల చేయకపోతే, గ్రామాల్లో అధికార నేతలను తిరగనివ్వబోమని అల్టిమేటం జారీ చేశారు. తమ పట్ల ఇదే ధోరణి చూపితే ఆత్మాహుతి చేసుకునేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు.