గంగాధర, జూలై 15 : గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో అప్పులపాలైన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి పురుగులమందు తాగి సోమవారం ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామంలో రూ.12 లక్షలతో అభివృద్ధి పనులు చేయగా, ఏండ్లు గడిచినా బిల్లులు రాకపోవడం, వడ్డీలు పెరిగిపోవడం తో అప్పులుతీర్చే మార్గంలేక సోమవారం గ్రా మంలో రోడ్డుపై గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. మంగళవారం బాధితుడిని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రవికి ప్రభుత్వమే చికిత్స చేయించాలని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మీరాజం డిమాండ్ చేశారు. బిల్లుల కోసం ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టింపులేనట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.