హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మాజీ సర్పంచ్‌లు చేపట్టిన సచివాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సర్పంచ్‌లు ఆకస్మాత్తుగా సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, సహాయ కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, నెమలి సుభాష్ గౌడ్, మెడబోయిన గణేష్, బొల్లం శారద, బకీర్ బీరప్ప, బొమ్మరపు సురేష్, బత్తిని తిరుమలేష్, ఎలుగు సోమయ్య, వర్రె శ్రీనివాస్, దండబోయిన మల్లేశ్, లచ్చిరామ్ నాయక్, గానుగుపాడు శ్రీనివాస్, వెంకటరామిరెడ్డి, పాండు రంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, పద్మారెడ్డిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులకు భయపడేది లేద ని స్పష్టం చేశారు. 13 నెలలుగా బిల్లుల కోసం ఉద్యమాలు చేస్తున్నామని, ఇప్పటికే పలువురు మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే ముందస్తుగా అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రజాపాలన ఇదేనా? అని ప్రశ్నించారు. అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన తమకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీశారు. తమ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసేదాకా తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.