హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ): పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 9న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తెలిపారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద శనివారం చలో అసెంబ్లీ పోస్టర్లను సర్పంచుల జేఏసీ నాయకులు పరదర్శించారు. అమరువీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. అనంతరం యాదయ్యగౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు మోసం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎంకు, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. గత్యంతరంలేక చలో అసెంబ్లీకి పిలుపునిచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి తాజా మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు గంటి మధుసూదన్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కేశబోయిన మల్లయ్య, జూకంటి బాలస్వామి, బీరప్ప పాల్గొన్నారు.
కేటీఆర్‌తో జడ్సన్ భేటీ
కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు బక్క జడ్సన్ శనివారం మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హైడ్రా బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికిచ్చే పరిహారంపై అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. ఇందుకు కేటీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు.
అసెంబ్లీలో మాజీ సర్పంచ్ల సమస్యలు ప్రస్తావిస్తా : కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సర్పంచ్ల సమస్యలను ప్రస్తావిస్తానని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. శనివారం కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్‌లు కలిశారు. ఈ సందర్భంగా సమస్యలపై గోడు వెళ్లబోసుకున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. అప్పుల భారం పెరిగిపోవడంతో గ్రామాల్లో తలెత్తుకోలేకపోతున్నామని ఏకరువు పెట్టారు. వారి సమస్యలపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.