Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు మళ్లీ పోరుబాట పట్టనున్నారు. సర్కా రు పట్టించుకోకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో త్వరలోనే చెల్లిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చిన హామీకి అతీగతీ లేకుండాపోయిందని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 5న సీఎం క్యాంప్ ఆఫీసు, మంత్రుల ఇండ్ల ముట్టడి, సెక్రటేరియట్ వద్ద నిరసన తెలపాలని సర్పంచులు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని కాంగ్రెస్ ముఖ్యనేతలు పదేపదే చెప్పారు. దాదాపు ఆరు నెలల తర్వాత రూ.691.53 కోట్లు బకాయిలు ఉన్నాయని లెక్కతేల్చారు. కానీ, గద్దెనెక్కి 400 రోజులు దాటినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నిరుడు డిసెంబర్లో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సాధ్యమైనంత తొందరలో చెల్లిస్తామని ప్రకటించారు. ప్రతిపక్షాల ఒత్తిడి, మాజీ సర్పంచుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రం అందించే ఉపాధిహామీ కింద చేపట్టిన పనులకు నిధులను విడుదల చేసింది. గతంలో ఎంబీ రికార్డు అయిన చెక్కుల ఫ్రీజింగ్ ఎత్తివేసింది. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని మాజీ సర్పంచులు చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి కింద నెలనెలా రూ.150 కోట్ల చొప్పున ఠంఛన్‌గా నిధులు విడుదల చేసేది. దీనికితోడు ఆర్థిక సంఘం నిధులు కూడా ఖాతాల్లో జమచేసేది. 2023లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. అనంతరం అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్పంచుల బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో వారిపై అప్పుల భారం పెరిగి సతమతమవుతున్నారు.