నమస్తే నెట్వర్క్, మే 27 : రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన నిధులు, హకుల కోసం ప్రభుత్వానికి వినతిపత్రం అందించేందుకు మంగళవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ వెళ్లకుండా జిల్లాల్లో ఎక్కడికక్కడ మాజీ సర్పంచ్‌లను కట్టడిచేశారు. తెల్లవారుజామునే ఇండ్లకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిర్బంధంపై మాజీ సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు రావాల్సిన బిల్లులను అడగడం కూడా నేరమేనా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ సర్పంచ్‌లను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిర్బంధించారు. మంగళవారం తెల్లవారుజామున వారి ఇండ్లకు వెళ్లి అరెస్టు చేసి, ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించి మాజీ సర్పంచ్ల భర్తలు, కుమారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని మాజీ సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు మంగళవారం ఉదయం హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధం కాగా..
సోమవారం అర్ధరాత్రి నుంచే మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఖానాపూర్, కడెం, లక్ష్మణచాంద మండలాల్లో మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల, అలంపూర్ మండలం ఊట్కూరు, సుల్తానాపురం, అయిజ మండలం గుడుదొడ్డి, మేడికొండ, చిన్న చింతకుంట, వెల్దండ మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ రాయపోల్ గంగిరెడ్డి బల్వంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తులేకలాన్ సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు.