Suryapet | సూర్యాపేట, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ఓ మహిళ సూర్యాపే ట జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ‘సేవ్ తెలంగాణ రామన్న’ అంటూ కన్నీటి పర్యంతమయ్యా రు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ కంటతడి పెట్టారు. ‘సేవ్ తెలంగాణ రామన్న’ అనే ప్లకార్డుతో సమావేశానికి వచ్చిన ఆమెను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా తన మదిలోని బాధలను పంచుకున్నారు. ‘నా పేరు రాధ. నేను మునగాల మండలం ముకుందాపురం మాజీ సర్పంచ్‌ను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఊరికి కాళేశ్వరం నీళ్లు వస్తే పంటలు బాగా పండించుకున్నాం. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నాయకులు అనేకం ఇస్తామంటే అదంతా మో సమని మా వాళ్లకు చెప్పినప్పటికీ ఆశ తో ఆ పార్టీకి ఓట్లు వేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది. ఇయ్యాల నీళ్లు రాక కండ్లముందు ఎండిపోతున్న పంటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. పుండు మీద కారం చల్లినట్టు.. రైతుబంధు అందడం లేదు. పంట పెట్టుబడి కోసం మళ్లీ చెయ్యి చాచాల్సి వస్తున్నది. చేస్తమన్న రుణమాఫీ చేయలేదు. మహిళలకు అదిస్తం.. ఇది స్తం.. అని ఊరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి వెక్కిరిస్తున్నరు. మహిళలకు ఇస్తమన్న రూ.2500 ఊసే ఎత్తడం లేదు. గ్యాస్ సిలిండర్ పథకం గ్యాసేనని తేలిపోయింది. ఉచిత కరెంటు ఇస్తమని చెప్పి ఇప్పుడు అసలు కరెంటే లేకుండా చేసిర్రు. ఉచిత బస్సు పథకం పెట్టి మహిళల మధ్య కొట్లాట పెట్టిర్రు. బస్సుల సంఖ్య తగ్గించిన్రు. ఉన్న ఒకటి, అర బస్సులు సమయానికి రావు. అక్కచెల్లెమ్మలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునేలా తగువు పెట్టి నవ్వుకుంటున్నరు. కేసీఆర్‌కు ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగులపై రేవంత్‌రెడ్డి కక్ష పెంచుకుండు. అందుకే పింఛన్లు పెంచట్లే.
ఉన్న పింఛన్లు ఇవ్వట్లే. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. ఊళ్లల్లో మంచినీళ్లు వస్తలేవు. కాంగ్రెస్ జెండాలు మోసి, ఆ పార్టీకి ఓట్లు వేయించిన నిరుద్యోగులు ఇప్పుడు అరిగోస పడుతున్నరు. వారి బాధను ఎవ్వరికీ చెప్పుకోవాలో తెల్వక కుమిలిపోతున్నరు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. కలలన్నీ కండ్లముందే చెదిరిపోతున్నయి. ఏపీలో ఉన్నప్పుడు అయ్యాళ ఉన్నట్టే ఈ రోజున ఊళ్లల్లో కరువుతో దుమ్ము లేస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు అంతా మంచిగుండే. నేడు కండ్లముందే అన్నీ చెదిరిపోతుంటే పాణం పోయినంత పనయితున్నది. గుండె తరుక్కుపోతున్నది. కేటీఆర్ అన్న కనిపించడంతో ‘సేవ్ తెలంగాణ రామన్న’ అని ప్లకార్డుపై రాసి ప్రదర్శించాను. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తెలంగాణను బతికించాలి’ అని చెబుతూ మాజీ సర్పంచ్ రాధ విలపించారు.