హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మెదక్ డీసీసీ మాజీ అధ్యక్షుడు కంఠా తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్వయంగా తిరుపతిరెడ్డిని కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. దీంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి, మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మంత్రి కేటీఆర్ సమక్షంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతోపాటు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని వెల్లడించారు. తిరుపతిరెడ్డి మంచి నాయకుడని, చాలా ఏళ్లుగా మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పార్టీ పైసలకి టికెట్లు అమ్ముకుంటున్నదని, దానిని నమ్ముకున్న వారిని ఆ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ను ఎదురోలేక కాంగ్రెస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికీ ఒక్క టికెట్ కూడా ఇచ్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని, ఇంత బలహీన పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ గెలుపును ఆశించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇంకా చాలామంది నాయకులు బీఆర్ఎస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని హరీశ్ వెల్లడించారు. బీఆర్ఎస్ ఏ పార్టీకి బీటీమ్ కాదని, తెలంగాణ ప్రజల టీమ్ అని పునరుద్ఘాటించారు. టికెట్లు ప్రకటిస్తే గందరగోళ పరిస్థితుల్లో పడతామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టికెట్ల కేటాయింపులో జాప్యం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కి పోటీయే లేదని, మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.