హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్లకు వస్తున్న సూచనలు పోలీసులు, జడ్జీలను కించపరిచేలా ఉన్నాయని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ చెప్పారు. ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు రింగ్ అయ్యే ముందు వచ్చే సూచనలో ‘మీకు పోలీసులు, జడ్జీలు వీడియో కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడవచ్చు. అలాంటి కాల్స్ మీకేమైనా వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అని ఉన్నదని తెలిపారు. ఈ సూచనలో పోలీసులు, జడ్జీలే నేరుగా వీడీయో కాల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతన్నట్టు తప్పు డు అర్థం వస్తున్నదని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ‘పోలీసులు, జడ్జీల పేరిట’ అని రావాల్సిన సమాచారం తప్పుగా వస్తున్నదని వెల్లడించారు. ఈ తప్పును సవరించాలని బీఎస్ఎన్ఎల్ సీజీఎంకు బుధవారం లేఖ రాశారు.