రవీంద్రభారతి, నవంబర్ 11: విద్యార్థుల పొట్టకొట్టి కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. మూడు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు బకాయిలు చెల్లించకుంటే 16న తరగతుల బహిష్కరణ, తహసీల్, ఆర్డీవో, కలెక్టరేట్లను ముట్టడిస్తామని పేర్కొన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్కాలర్షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. 14లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు రూ.4వేల కోట్ల లేవు కానీ, కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఎలా పాస్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
బడ్జెట్ ఖర్చు వివరాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సు పూర్తయినా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉన్నత కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాలను పొందలేకపోతున్నారని తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం కాలేజీ విద్యార్థుల సాలర్షిప్ను ఏడాదికి రూ.5500 నుంచి 20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, లేకుంటే విద్యార్థులతో కలిసి రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, గజ్జ సత్యం, సీ రాజేశ్, లాల్‌కృష్ణ, అంజి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.