ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని వద్దే వద్దన్న రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించిండు..దీపం ఉండంగనే ఇల్లు చకబెట్టుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు మూటలు కట్టుకునే పనిలో మునిగి తేలుతున్నారు. – కేటీఆర్
KTR | హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని, ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శనివారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ దయాకర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీచేసిన నర్మద బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొడంగల్‌లో ఫార్మా కంపెనీ వద్దే వద్దన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుండడంతో స్థానికులు తరిమికొట్టే పరిస్థితి వచ్చిందని ఎద్దేవాచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని తకువ ఖర్చుతో సస్యశ్యామలం చేసే ప్రణాళికలు పకనపెట్టి, కేవలం కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టారని మండిపడ్డారు. మొన్నటిదాకా రేవంత్‌రెడ్డి తిట్టిపోసిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థం చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కలిసికట్టుగా పనిచేసి కొడంగల్‌లో కాంగ్రెస్‌ను మట్టికరిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఎక్కడ చూసినా ఉద్యమకాలం దృశ్యాలే
తెలంగాణలో ఎక్కడ చూసినా మళ్లీ ఉద్యమ కాలం నాటి దృశ్యాలే కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుడూ ఇప్పుడూ ప్రజల ప్రత్యర్థి కాంగ్రెస్సేనని ధ్వజమెత్తారు. ఏనాటికైనా ప్రజల పక్షాన నిలబడింది..నిలబడేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీతో రైతులకు ధోకా చేసింది కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించిందని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల జాతర అని డబ్బా కొట్టి హామీలకు పాతరేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో సకల జనులు సంక్షేమంతో ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో సంక్షోభం వైపు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
కర్షక ద్రోహి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కర్షకుల ద్రోహిగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోనస్ మాట దేవుడెరుగు తెల్లబంగారం తెల్లబోతున్నదని మండిపడ్డారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల పత్తిరైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సాకులు చూపి కొనుగోళ్లు నిలిపేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆగమైపోతున్న పత్తిరైతును పట్టించుకోవాలన్న సోయి సర్కారుకు లేదని మండిపడ్డారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్‌లో చెప్పి ఉలుకూ పలుకూ లేకుండా కాంగ్రెస్ సరారు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట అయిన పత్తి కొనుగోలు విషయంలో మాట నిలబెట్టుకోవాలన్న కనీస సోయిలేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి రైతులను దగా చేసిందని, సన్నాలకే ఇస్తామని షరతులు పెట్టి, పత్తి రైతులను కూడా ఆగం చేస్తున్నదని విమర్శించారు. గాంధీ దవాఖానను సర్కారు గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ‘గాంధీని గాలికొదిలి..గాల్లో చకర్లు కొడుతుతున్న కాంగ్రెస్’ అంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవాచేశారు.
దండుపాళ్యం ముఠా
తెలంగాణ పాలిట సీఎం సోదరులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారని కేటీఆర్ ఆరోపించారు. న్యాయవాది భూములపైనే కన్నేశారని, న్యాయవాదికే న్యాయం దకకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓవైపు తన సోదరులకు తెలంగాణ ఆస్తులను దోచి పెడుతూ మరోవైపు అమెరికాలో తమ్ముడి కంపెనీతో రూ. 1000 కోట్ల ఒప్పందంతో ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన కుటుంబానికి సీఎం సోదరులు ఇచ్చిన బహుమానం ఇదా? అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రేవంత్‌రెడ్డి సర్కార్‌కు విద్యుత్తు చార్జీల పెంపుపై ఉన్న శ్రద్ధ గాంధీలో మంచినీళ్లపై లేకపాయె! మూసీపై ఉన్న మకువ వీల్చైర్లపై లేకపాయె! ఫోర్ బ్రదర్స్ సిటీపై ఉన్న ఇష్టం విరేచనాల మందులపై లేకపాయె! దీపావళికి బాంబులు వేయడంపై ఉన్న దృష్టి గాంధీలో రోగులపై లేకపాయె! అదానీ అంబుజా సిమెంట్‌పై ఉన్న ఇష్క్ గాంధీలో బెటాడిన్ బిళ్లలపై లేకపాయె! – కేటీఆర్
కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోపే తెలంగాణలో అన్ని వర్గాలు రగిలిపోతున్నయి. సరార్ అనాలోచిత చర్యలతో ప్రజలు తిరగబడుతున్నరు. నాడు స్వరాష్ట్రం కోసం పేగులు తెగేదాకా కొట్లాడినం.. నేడు అవకాశవాదుల నుంచి కాపాడుకుంటం.
– కేటీఆర్
ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా అనేక వర్గాల ధర్నాలు,రాస్తారోకోలతో తెలంగాణ అట్టడుకుతుంటే మంత్రులు విహార యాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది. – కేటీఆర్
తెలంగాణ పాలిట సీఎం సోదరులు దండుపాళ్యం ముఠాలా తయారైండ్రు. న్యాయవాది భూములకే ఎసరు పెట్టిండ్రు. న్యాయం చేయాల్సిన పోలీసులే సీఎం సోదరులతో సెటిల్ చేసుకొమ్మంటరా? రాష్ట్రంలో ఉన్నది పోలీసులా? రేవంత్ ప్రైవేట్ సైన్యమా? న్యాయవాదికే న్యాయం దకకపోతే సామాన్యుల పరిస్థితేంది? – కేటీఆర్