హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్/అలంపూర్, జనవరి 12 : రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరున్న నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (72) ఆదివారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, గుండె, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 22న ఊపిరితిత్తుల సమస్య రావడంతో కుటుంబసభ్యులు నిమ్స్‌లో చేర్చారు. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో ఆయనను ఆర్ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రాగా, వెంటనే అత్యవసర వైద్య చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. రాత్రి 7.40గంటలకు మృతిచెందినట్టు నిమ్స్ వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మందా జగన్నాథం భౌతికకాయాన్ని నిమ్స్ నుంచి హైదరాబాద్‌లోని చంపాపేట్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మందా జగన్నాథం మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి కృషి, పార్టీకి వారు అందించిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, ప్రస్తుత ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో పెద్దపుల్లయ్య- మంద సవారమ్మ దంపతులకు 1951 మే 22వ తేదీన మందా జగన్నాథం జన్మించారు. ఆయన తండ్రి నాగార్జునసాగర్‌లోని పైలాన్ కాలనీలో మెకానికల్ విభాగంలో వాచ్‌మెన్‌గా, తల్లి సవారమ్మ హిల్‌కాలనీలో ఆఫీస్ అటెండెంట్‌గా పని చేశారు. విద్యాభ్యాసం అనంతరం వైద్య వృత్తిలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుంచి పోటీచేసి నాగర్‌కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు. తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1996, 1999, 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2014 మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీ పదవిని త్యాగం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన కుమారుడికి అలంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మందా జగన్నాథం నాగర్‌కర్నూల్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో దిగగా, విజయం వరించలేదు. అయినా కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయన సేవలను గుర్తించిన కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ప్రతినిధిగా క్యాబినెట్ హోదాలో రెండుసార్లు అవకాశం కల్పించారు. మందా జగన్నాథంకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మంద జగన్నాథం మృతితో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.
మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతిపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. నాగర్‌కర్నూల్ ప్రజలకు సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన మంద జగన్నాథం మృతి బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మందా జగన్నాథం మృతి బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి హరీశ్‌రావు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో వారిది ప్రత్యేక ముద్ర అని పేర్కొన్నారు. మందా జగన్నాథం మృతిపై శాసనసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రులు వేము ల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధా న కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఆంజనేయులు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఎర్రోళ్ల తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.