కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 18: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కేవలం 45 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రటకనలో విమర్శించారు. మిగతా 55 శాతం మందిని మోసం చేసిందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9నే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి.. రైతులను నిండా ముంచారని ఆరోపించారు.
ప్రభుత్వం మొదట రూ.41 వేల కోట్లు రుణమాఫీకి అవసరమని చెప్పి, క్యాబినెట్ భేటీలో రూ.31 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొని, ఇప్పుడు 8 నెలల తర్వాత కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.