హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తన మాటలను వక్రీకరించి మీడియాలో ఇష్టారీతిన మా ట్లాడుతున్న ఎంపీ ఈటల రాజేందర్ రాజీనామా చేయాలని, లేదా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఈటల రాజేందర్ తనపై చౌకబారు వ్యాఖ్య లు చేశారని మండిపడ్డారు. ‘నేను ఏ వీడియోలో రేవంత్‌రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, ప్రగతి కాముకుడు అని చెప్పానో చూపాలి. లేకపోతే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేయాలి. కాదంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. హైడ్రా విషయంలో బీజేపీ వైఖరి ఏంటో చెప్పి.. ఆ తర్వాత మా ట్లాడండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ను వీడిన తర్వాత ఈటల రాజేందర్ నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపింది నిజం కాదా? ఇకముందు కూడా కాంగ్రెస్‌లో చేరబోనని గ్యారెంటీ ఇవ్వగలరా ?శాశ్వతంగా బీజేపీలోనే ఉంటానిని చెప్పగలరా? ఇతరులపై చౌకబారు వ్యాఖ్యలు చెప్పేముందు గతం ఒక్కసారి చూసుకోవాలి’ అంటూ హితవు పలికారు.
మంత్రిగా మాట్లాడలేదేమీ?
‘బీఆర్ఎస్ హయాంలో మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ బడాబాబుల అక్రమాలపై ఎందుకు మాట్లాడలేదు? నేను ఎప్పట్నుంచో పేదల గురించి మాట్లాడుతున్నా. ఉద్యమకాలం నుంచి ఎన్ కన్వెన్షన్, పద్మాలయ స్టూడియో, లగడపాటి ల్యాంకోహిల్స్, అయ్యప్పసొసైటీ వంటి వాటి పై గళమెత్తాను. నాడు ఎమ్మెల్సీగా జిల్లెలగూడ చెరువు, మంత్రాల చెరువు, మీర్పేట్ చెరువుల గురించి ప్రస్తావించా. మేము పేదల గురించి పోట్లాడుతుంటే మీరు ఎక్కడున్నారు ఈటల రాజేందర్?’ అని ప్రశ్నించారు. ఈట ల కంటే ముందే.. హైడ్రా కమిషనర్‌తో పేదల ఇండ్ల గురించి ప్రస్తావించినట్టు చెప్పారు. తాను జెండాలు, ఎజెండాలు మార్చే సూడో పొలిటీషియన్‌ను కాదని, తనపై చేసిన వ్యా ఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.