హైదరాబాద్, జనవరి 21: ‘కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. నాడు తెలంగాణను ఆంధ్రాలో కలుపడం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా కాంగ్రెస్ ఈ ప్రాంత ప్రజలను దగా చేసింది. ఇప్పుడు అధికారం చేపట్టి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ద్రోహం చేస్తున్నది’ అని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సగం మంది రైతులకు రుణమాఫీ చేసి, రైతుభరోసాను కుదించి రైతాంగాన్ని వంచించిందని విమర్శించారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్లు వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, మేడె రాజీవ్‌సాగర్, రాంచంద్రనాయక్తో కలిసి సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
జనవరి 26 నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు ఇస్తామని ఊదరగొట్టిన సీఎం, మంత్రులు ఇప్పుడు 600 గ్రామాల్లోనే అమలు చేస్తామని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, రైతు రుణమాఫీ రూ.28 వేల కోట్లు, రైతుబీమా కింద రూ.5 వేల కోట్ల చొప్పున మొత్తంగా రూ.ఒక లక్షా ఆరువేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని గుర్తుచేశారు. మొన్న ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వబోమన్న లగచర్ల రైతులపై, నిన్న గ్రామసభలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు నాయకులపై పోలీసులతో కొట్టించారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ మోసాలకు ఏడాదిలో 400 మందికి పైగా రైతులు బలయ్యారని కర్నె ప్రభాకర్ ఆందోళన వ్యక్తంచేశారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళవారం నల్లగొండలో చేపట్టనున్న బీఆర్ఎస్ రైతుదీక్షకు రైతాంగం పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కోసం గజ్జెకట్టి ఆటపాటలతో చైతన్యం నింపిన గద్దర్ అంటే బీఆర్ఎస్కు ఎనలేని గౌరవమని చెప్పారు.