మల్యాల, డిసెంబర్ 24: ‘జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అటవీశాఖ, దేవాదాయశాఖల మధ్య భూహద్దుల వివాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపరెందుకు..? నెలరోజులుగా వివాదం నడుస్తున్నా మౌనం వీడి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయకపోడం అనుమానాలకు తావిస్తున్నది’ అని చొప్పదండి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం కొండగట్టు అంజన్నను దర్శించుకుని కొండపైన అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన మార్కింగ్‌ను పరిశీలించారు.
కొండ కింద శ్రీయాన్స్ హోటల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అంజన్న ఆలయానికి ఎం తో చరిత్ర ఉందని, ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారన్నారు. ఆలయ ప్రాంగణంలో తమ భూములు ఉన్నాయంటూ అటవీశాఖ అధికారులు ఇటీవల దేవాదాయ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేయడంతో రెండు శాఖల మధ్య నెల రోజులుగా వివాదం నడుస్తున్నదని చెప్పారు. అధికారుల తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు పట్టించుకోకపోవడం సరికాదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కన్ను ఆలయ భూములపై పడిందని ఆరోపించారు. అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ భూ హద్దుల వివాదంపై ఒకసారైనా ఎందుకు సమీక్షించ లేదని ప్రశ్నించారు. ఆలయ ప్రాంగణ పరిరక్షణ కోసం కృషి చేయాలని, లేదంటే భవిష్యత్‌లో భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కొండగట్టు ఆలయ భూముల విషయంలో నెల రోజులుగా వివాదం నడుస్తున్నా కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ సంజయ్ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయానికి 330 ఎకరాలు ఇప్పించడంతోపాటు అటవీ భూప్రాంతాన్ని ఇప్పించేందుకు పార్లమెంట్లో అప్పటి ఎంపీ వినోద్‌కుమార్ సమస్యను లేవనెత్తారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ హ యాంలో కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ప్రకటించి, రూ.100 కో ట్లు మంజూరు చేయడంతో మౌలిక వసతు ల కల్పన పనులు ప్రారంభించినట్టు చెప్పా రు. కొండగట్టులో తాగునీటి వసతి కోసం పంప్‌హౌస్ నిర్మాణానికి రూ.13.50 కోట్లతో పనులు ప్రారంభించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పను లు నిలిచి పోయాయని ఆరోపించారు. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫున రూ.35.19 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారని, సీఎం రేవంత్‌రెడ్డికి అంజన్న ఆలయ అభివృద్ధి ఎందుకు పట్టదు అని ప్రశ్నించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనులు పూర్తిచేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.