యాదగిరిగుట్ట, నవంబర్ 6 : మూసీ ప్రక్షాళన కాదు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారిని వేడుకుని చేసిన పాపాలకు ప్రక్షాళన చేసుకో అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లులేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అదే కేసీఆర్ మహాద్భుతంగా పునర్నిర్మించిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నాడని అన్నారు.
స్వామివారిని పుణ్యాత్ములు, పాపాత్ములు దర్శించుకుంటారని, సీఎం రేవంత్‌రెడ్డి సైతం తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు స్వామివారిని దర్శించుకునేందుకు రావాలని కోరారు. వంద మంది ముఖ్యమంత్రులొచ్చినా తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయలేరని అన్నారు. బుధవారం ఆమె యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ టెంపుల్ సిటీ 1200 ఎకరాల భూములను కబ్జా చేస్తారేమోనన్న భయం కలుగుతుందని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మాజీ సీఎం కేసీఆర్ రూ.1,300 కోట్లతో ఎంతో గొప్పగా యాదగిరిగుట్టను నిలిపారని, భక్తులకు సౌకర్యవంతమైన రహదారులను నిర్మించారని తెలిపారు. యాదగిరిగుట్ట విమానగోపురం స్వర్ణతాపడానికి వచ్చిన బంగారంపై స్పష్టతనివ్వాలని సునీత డిమాండ్ చేశారు. గతంలో 125 కిలోల బం గారం అవసరమని గత స్తపతులు, ఆర్ట్ డైరెక్టర్ నిశ్చయించారని, గతంలో ఎంతమంది భక్తులు విరాళంగా ఇచ్చారని, ఇప్పటివరకు ఎంత బంగారం, నగదు సమకూరిందో స్పష్టత నివ్వాలని కోరారు.