ఇనుగుర్తి, మార్చి 20 : సీఎం రేవంత్‌రెడ్డిని తిట్టాడనే కారణంతో దౌర్జన్యంగా అరెస్ట్ చేసిన దళిత రైతు దర్శనం వెంకటయ్యను సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అర్ధరాత్రి క్షేమంగా వదిలిపెట్టారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారానికి చెందిన దళిత రైతు వెంకటయ్య (77)ను బుధవారం సీసీఎస్ పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాడనే కారణంతో దళిత రైతును అరెస్టు చేశారనే విషయం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ‘నా భర్త వెంకటయ్య ఇంటికాడ అన్నం తింటుండగా.. పోలీసులు వచ్చి అన్నం పళ్లెం గుంజేసి.. అటో రెక్క ఇటోకరెక్క పట్టుకొని తీస్కొనిపోయిండ్రు.. నా ముసలోడు బువ్వదినకుండా ఎత్కపోయిండ్రు’ అని లక్ష్మి వాపోయిన విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో వెంకటయ్యను గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు సీసీఎస్ పోలీసులు ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా గురువారం వెంకటయ్య ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం తన భూసమస్యను చెప్పడానికి హైదరాబాద్‌కు వెళ్లినట్టు తెలిపారు. అక్కడ కొంతమంది యూట్యూబ్ చానళ్ల వారు తనను ఇంటర్వ్యూ చేయగా, భూ సమస్య గురించి చెప్పానన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కావాలని ఉద్దేశపూర్వకంగా దూషించలేదని, తన భూమి పోయిందన్న బాధలో మాట్లాడినట్టు పేర్కొన్నారు. వైఎస్సార్ హయాంలో లాక్కున్న 5 ఎకరాలను తిరిగి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇదే విషయాన్ని సీసీఎస్ పోలీసులకు చెప్పగా సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇంటికి తిరిగి వచ్చిన రైతు వెంకటయ్యను మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పరామర్శించారు.